షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయి!

  • షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • పాదయాత్రలకు అనుమతిని ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించిన హైకోర్టు
  • తెలంగాణ ఏమైనా తాలిబాన్ రాజ్యమా? అని ప్రశ్న
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పాదయాత్రకు గతంలో తాము విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఆ షరతులను గుర్తుంచుకోవాలని సూచించింది. పాదయాత్రల కోసం రాజకీయ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని... పాదయాత్రలకు పోలీసులు అనుమతిని ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ ఏమైనా తాలిబాన్ రాజ్యమా? అని ప్రశ్నించింది. 

షర్మిల పాదయాత్రను అనుమతించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను న్యాయస్థానం ఆదేశించింది. పాదయాత్రకు తాము అనుమతిని ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా నిరాకరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 పాదయాత్రలో రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయవద్దని షర్మిలకు కోర్టు సూచించింది. పాదయాత్రకు సంబంధించి ఇరువైపు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వైఎస్సార్టీపీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది.

మరోవైపు లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టుకు వెళ్లేందుకు షర్మిల యత్నించారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లను పెట్టి ఆమె బయటకు రాకుండా నిలువరించారు.


More Telugu News