ఏపీతో సంబంధం లేనివాళ్లు కూడా అసత్యాలు మాట్లాడుతున్నారు: ఏపీ మంత్రి అమర్నాథ్

  • రుషికొండను సందర్శించిన రాజేంద్రసింగ్
  • కన్నీళ్లు ఆగడంలేదని వ్యాఖ్యలు
  • రాజేంద్ర సింగ్... రామోజీరావుకు 20 ఏళ్లుగా సన్నిహితుడన్న అమర్నాథ్
  • కొత్త వ్యక్తిని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శ 
వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన రాజేంద్ర సింగ్ విశాఖలోని రుషికొండను చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదని వ్యాఖ్యానించడం తెలిసిందే. రాష్ట్రీయ జల బిరాదరీ (ఆర్జేబీ) చైర్మన్, ప్రఖ్యాత రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ రుషికొండను సందర్శించారు. రుషికొండపై విధ్వంసం, కొండ చుట్టూ తవ్వేసిన తీరు బాధను కలిగిస్తోందని, ఈ ప్రభుత్వం క్షమించరాని నేరానికి పాల్పడుతోందని అన్నారు. 

దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీతో సంబంధం లేనివాళ్లు కూడా అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటీవల సీపీఐ నారాయణ వచ్చి రుషికొండను చూసి వెళ్లారని, ఇప్పుడు రాజేంద్ర సింగ్ అనే కొత్త వ్యక్తిని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. 

రాజేంద్ర సింగ్... రామోజీరావుకు 20 ఏళ్లుగా సన్నిహితుడు అని అమర్నాథ్ వెల్లడించారు. కొండను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. నాడు అమరావతిలో రైతుల పొలాలు లాగేసుకున్నప్పుడు వారి కన్నీరు కనిపించలేదా? అని ప్రశ్నించారు. 

రుషికొండలో అక్రమ కట్టడాలు అంటూ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుండడాన్ని వీరు భరించలేకపోతున్నారని, గత సర్కారు పాలనలో జరిగిన అక్రమాలపై వీళ్లు ఎందుకు ప్రశ్నించలేదని అమర్నాథ్ నిలదీశారు. రామోజీరావు ఫిలిం సిటీని ఎక్కడ కట్టాడు? కొండల్లో కాదా? అని ప్రశ్నించారు.


More Telugu News