తుపాను వల్ల దెబ్బతిన్న ప్రతి ఎకరానికి పరిహారం చెల్లించాలి: పవన్ కల్యాణ్

  • ఏపీలో మాండూస్ తుపానుతో భారీ వర్షాలు
  • లక్షల ఎకరాల్లో వరి నీటమునిగిందన్న పవన్
  • పత్తి, బొప్పాయి, అరటి దెబ్బతిన్నాయని వెల్లడి
  • మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించడంలేదని విమర్శలు
ఏపీలో మాండూస్ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తుపాను బాధిత రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. 

ఓవైపు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న ఏపీ రైతులను మాండూస్ తుపాను కూడా దెబ్బతీసిందని పవన్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలు చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాల్లో వరిపంట నీటపాలైందని, పత్తి వంటి వాణిజ్య పంటతో పాటు బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు కూడా తుపాను ధాటికి నేల రాలాయని వివరించారు. 

ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పడంలేదని జనసేనాని విమర్శించారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను తిట్టడానికి వరుసగా నేతలను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో కూడా స్క్రిప్టులు అందించే తాడేపల్లి పెద్దలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాలని తమ నాయకులకు ఎందుకు చెప్పరని పవన్ ప్రశ్నించారు. 

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అండను ఇవ్వాలని తెలిపారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు సహేతుకమైన నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కల్లంలోని తడిసిన ధాన్యాన్ని ఇప్పటికైనా వెంటనే కొనుగోలు చేయాలని, కూరగాయలు, పండ్ల తోటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని స్పష్టం చేశారు.


More Telugu News