ఒక్క రోజులోనే లక్షకు పైగా భక్తులు.. కిక్కిరిసిన శబరిమల

  • సోమవారం దర్శనానికి 1,07,260 మంది దరఖాస్తు
  • అదనపు ఏర్పాట్లు చేసిన దేవస్థానం బోర్డ్, పోలీసులు
  • 30 నిమిషాలు అదనపు సమయం దర్శనం కల్పించాలన్న హైకోర్టు
శబరిమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొండలన్నీ భక్తులతో నిండిపోయాయి. సోమవారం ఒక్క రోజే స్వామి దర్శనం కోసం రూ.1,07,260 మంది భక్తులు తమ పేర్లను బుక్ చేసుకున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ అదనపు ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నాయి.

భక్తుల రద్దీ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం శబరిమలలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. అసలు ఒక సీజన్ లో ఒక్క రోజులో అధిక సంఖ్యలో భక్తులు దర్శనాలకు రావడం ఇదే మొదటిసారి అని ఆలయం వర్గాలు చెబుతున్నాయి. రద్దీ నియంత్రణకు అదనపు పోలీసులు రంగంలోకి దిగారు. పంబ నుంచి సన్నిధానం వరకు ఒక వరుస క్రమంలో వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.

మరోవైపు రద్దీ రోజుల్లో అధిక సమయం పాటు స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పించడాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించింది. అయ్యప్పస్వామి సన్నిధి తంత్రిని సంప్రదించి దర్శన సమయాన్ని 30 నిమిషాలు పెంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ)ని హైకోర్టు కోరింది. రద్దీ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. గత శనివారం కోసం లక్ష మంది బుక్ చేసుకోగా, 90వేల మంది భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. రోజువారీ భక్తుల సగటు సంఖ్య 75 వేలకు పైగానే ఉంటోంది. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాల క్రమబద్ధీకరణకు సైతం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News