18 ఏళ్లకే మేయర్‌గా ఎన్నికై.. అమెరికాలో చరిత్ర సృష్టించిన నల్లజాతి విద్యార్థి!

  • ఇటీవల హైస్కూలు విద్యను పూర్తి చేసిన జైలెన్ స్మిత్
  • ఎర్లే నగరానికి మేయర్‌గా ఎన్నికై రికార్డు
  • ఎర్లే జనాభా 1800 మాత్రమే
  • ప్రజా భద్రతను మెరుగుపరుస్తానని, వ్యాపారాలు తీసుకొస్తానని ప్రజలకు హామీ
అమెరికాలో 18 ఏళ్ల విద్యార్థి చరిత్ర సృష్టించాడు. తూర్పు ఆర్కాన్సాస్‌లోని ఓ చిన్న నగరానికి మేయర్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నల్లజాతీయుడైన జైలెన్ స్మిత్.. ఏర్లే నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఫలితంగా అమెరికాలో ఓ నగరానికి మేయర్‌గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, అమెరికాలోని ఆఫ్రికన్ అమెరికన్ మేయర్స్ అసోసియేషన్‌లోనూ ఆయన అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌లో అత్యంత పిన్న వయస్కుడైన క్లీవ్‌లాండ్ మేయర్ జస్టిన్ బిబ్ వయసు 35 ఏళ్లు కాగా, ఇప్పుడా రికార్డును స్మిత్ తుడిచిపెట్టేశాడు. 

ఎర్లే హైస్కూల్ గ్రాడ్యుయేట్ అయిన స్మిత్ ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశాడు. టెనెస్సీలోని మెంఫిన్‌కు వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్లే నగరంలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు. 1800 మంది మాత్రమే నివసించే ఈ నగరంలో ప్రజా భద్రతను మెరుగుపరుస్తానని, కిరాణా సహా కొత్త వ్యాపారాలను తీసుకొస్తానని ప్రచారం చేశాడు. స్మిత్ ప్రస్తుతం ఆర్కాన్సాస్‌లోని వెస్ట్ మెంఫిస్‌లోని ఆర్కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ మిడ్ సౌత్ విద్యార్థి. 

తాను చాలా చిన్నవాడినైనా ప్రజలు తనను ఆదరించారని, తనకు అనుభవం ఉందా? లేదా? అన్న విషయాన్ని పట్టించుకోలేదని, తానొక హైస్కూలు విద్యార్థినన్న విషయాన్ని కూడా చూడకుండా తనను గెలిపించారని స్మిత్ ఆనందం వ్యక్తం చేశాడు.


More Telugu News