పిల్లల్లో న్యూమోనియాను ఇలా గుర్తించొచ్చు..!

  • శ్వాస తీసుకునే రేటు అసాధారణంగా పెరుగుతుంది
  • దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు
  • జ్వరం, చలి, ఆహారం తీసుకోకపోవడం కూడా లక్షణాలే
మన దేశంలో దాదాపు అన్ని పట్టణాల్లోనూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా రిస్క్ అధికంగా ఉంటుంది. వీరిలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండదు. అందుకే వీరు తరచుగా వీటి బారిన పడుతుంటారు. 

ఏటా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మంది చిన్నారులు (ఐదేళ్లలోపు) న్యూమోనియాతో మరణిస్తున్నట్టు యునిసెఫ్ గణాంకాలు చెబుతున్నాయి. మరో 2 లక్షల మంది శిశువులు పుట్టిన కొన్ని రోజులకే న్యూమోనియాతో మరణిస్తున్నారు. ఇలా నమోదవుతున్న న్యూమోనియా మరణాల్లో సగం వాయు కాలుష్యం వల్లే కావడం గమనార్హం. అందుకని తల్లిదండ్రులు పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్ల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

న్యూమోనియా అంటే..?
న్యూమోనియా అన్నది ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ ను కలిగించేది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ లు, బ్యాక్టీరియా, అరుదుగా ఫంగస్ వల్ల న్యూమోనియా ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపరల ద్వారా ఇతరులకు సోకుతుంది. 

లక్షణాలు/గుర్తించడం ఎలా?
ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వారి ఊపిరితిత్తులు ఫ్లూయిడ్ తో నిండిపోతాయి. ముఖ్యంగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం గమనించొచ్చు. ఇన్ఫెక్షన్ లేదా న్యూమోనియా సోకిందని గుర్తించడానికి వారి శ్వాస రేటు ఎంత ఉందన్నది చూడాలి. దీన్నే రెస్పిరేటరీ రేట్ (ఆర్ఆర్) అంటారు. చిన్నారి నిద్రిస్తున్న సమయంలో ఛాతీ ఎన్ని సార్లు పైకి ఉబ్బుతోందన్నది లెక్కించాలి. 

మనం శ్వాస తీసుకున్న సమయంలో ఊపిరితిత్తులు ఉబ్బుతాయి కనుక ఛాతీ కొంత ఎత్తుకు లేస్తుంది. దీన్నే రెస్పిరేటరీ రేట్ అంటారు. ఒకవేళ నిమిషానికి 50 సార్లు ఆర్ఆర్ ఉంటే సమస్య ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. 1-5 ఏళ్ల వయసు పిల్లలకు శ్వాస రేటు 40కి పైన ఉంటే అది అసాధారణమే అవుతుంది. ఐదేళ్లకు పైన వయసు పిల్లల్లో ఆర్ఆర్ 30లోపే ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే సమస్య ఉన్నట్టు భావించొచ్చు. 

ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే చిన్నారులు శ్వాస తీసుకోలేరు. ఆక్సిజన్ స్థాయి తగ్గడం వల్ల ముఖం నీలం రంగులోకి మారిపోతుంది. బ్యాక్టీరియా వల్ల న్యూమోనియా వస్తే జ్వరం కూడా ఉంటుంది. చలి, వేగంగా శ్వాస తీసుకోవడం, తలనొప్పి, దగ్గు, ఆకలి లేదంటూ తినకపోవడం గమనించొచ్చు.  

వ్యాధి నిర్ధారణ
అసాధారణంగా శ్వాస రేటు, శ్వాస తీసుకోలేకపోవడం సహా పైన చెప్పుకున్న లక్షణాలు ఏవి కనిపించినా కానీ వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. వైద్యులు భౌతికంగా పరిశీలించి, చెస్ట్ ఎక్స్ రే, సీబీపీ, ఈఎస్ఆర్ తదితర కొన్ని రకాల రక్త పరీక్షలతో దీన్ని నిర్ధారిస్తారు. కళ్లె పరీక్ష కూడా చేయించొచ్చు. 

చికిత్స
ఇన్ఫెక్షన్ తగ్గేందుకు వైద్యులు ఔషధాలను సూచిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, అడ్మిట్ చేసుకుని, నరం ద్వారా మందులతో చికిత్స చేస్తారు. పిల్లల శ్వాస రేటు, గుండె పనితీరు ఇతర అంశాలను జాగ్రత్తగా మానిటర్ చేస్తారు. అందుకే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.


More Telugu News