మస్క్ కు సహకరిస్తాం... కానీ ఇక్కడే యూనిట్లు స్థాపించాలి: నితిన్ గడ్కరీ

  • భారత్ లో అడుగుపెట్టేందుకు మస్క్ ప్రణాళికలు
  • అయితే దిగుమతి చేసే కార్లను అనుమతించాలని షరతు
  • విదేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మడం కుదరదన్న గడ్కరీ
  • ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రాయితీలు ఇస్తామని ఆఫర్ 
భారత్ లోనూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని ఎలాన్ మస్క్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. తన టెస్లా సంస్థ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ కార్లతో భారత్ లో అడుగుపెట్టాలని మస్క్ చాలాకాలం కిందటే ప్రణాళికలు రూపొందించినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతిస్తేనే భారత్ కు వస్తామని మస్క్ అప్పట్లో తెగేసి చెప్పారు. 

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఎలాన్ మస్క్ కు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ మస్క్ తమ పరిశ్రమలను వేరే దేశాల్లో స్థాపించి, వాటి ఉత్పత్తులను భారత్ లో విక్రయిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. 

మస్క్ భారత్ లోనే తమ యూనిట్లు స్థాపించి, వాటి ఉత్పాదనలు విక్రయించుకుంటే కేంద్రం స్వాగతిస్తుందని గడ్కరీ వివరించారు. చైనా వంటి దేశాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి, భారత్ లో విక్రయాలు జరుపుతామంటే అంగీకరించబోమని అన్నారు. ఎలాన్ మస్క్ భారత్ లోని ఏ రాష్ట్రంలో అయినా తమ యూనిట్లు స్థాపించుకోవచ్చని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, రాయితీలు ఇస్తామని గడ్కరీ పేర్కొన్నారు.

భారత్ లో ఆటోమొబైల్ రంగంలో ప్రతి ఏడాది రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు.


More Telugu News