స్పీడు పెంచిన మాండూస్... కృష్ణపట్నం పోర్టులో ఆరో నెంబరు ప్రమాద హెచ్చరిక

  • గంటకు 14 కిమీ వేగంతో పయనం
  • చెన్నైకి 170 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
  • నెల్లూరు జిల్లాలో జోరుగా వానలు
  • తమిళనాడులో ఒకరి మృతి
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండూస్ తుపాను వాయవ్య దిశగా పయనిస్తూ తీరాన్ని సమీపిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు గంటకు 12 కిమీ వేగంతో పయనించిన ఈ తుపాను సాయంత్రానికి 14 కిమీ వేగంతో ప్రయాణిస్తూ మహాబలిపురం దిశగా వస్తోంది. 

ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆరో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. 

నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తడ మండలం భీములవారిపాలెం వద్ద పులికాడ్ సరస్సులో నిలిపి ఉంచిన మూడు నాటు పడవలు మునిగిపోయాయి. అటు, బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 

తమిళనాడులో మాండూస్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. కారైక్కుడిలో గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఓ వ్యక్తి ఈదురుగాలులకు కిటికీ తలపై పడడంతో మరణించాడు. ఓ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి ఆ గ్లాస్ కిటికీ కిందపడింది.


More Telugu News