ఈ ఏడాది వినూత్న డిజైన్లతో మనసు గెలిచిన ఫోన్లు

  • అన్నింటిలోకీ నథింగ్ ఫోన్ 1 ప్రత్యేకం
  • ఫోన్ వెనుక భాగం పారదర్శకం
  • రియల్ మీ జీటీ 2 ప్రో, వివో వీ 25 ప్రో కూడా ప్రత్యేకమే
  • సూపర్ లగ్జరీ ఫినిష్ తో గెలాక్సీ ఎస్22 అల్ట్రా
2022 సంవత్సరంలో ప్రముఖ కంపెనీలు గుర్తుండిపోయే వినూత్న డిజైన్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. ఈ ఏడాది ముగిసిపోతున్న తరుణంలో వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం.

నథింగ్ ఫోన్ (1)
‘స్మార్ట్ ఫోన్ డిజైన్ ఇలానే ఉండాలి’ అనే సంప్రదాయాన్ని నథింగ్ ఫోన్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ బ్రేక్ చేశారు. స్మార్ట్ ఫోన్ లోపలి భాగాలు ఎలా ఉంటాయో? అన్న సస్పెన్స్ కు తెరదించుతూ.. ఫోన్ వెనుక వైపు పారదర్శక కవర్ తో, లోపల ఏముంటుందో చూసేలా చేశారు ఆయన. అందుకే ఇది అత్యంత యూనిక్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వెనుక భాగంలో లైట్ వెలిగేలా ఏర్పాటు మరో ప్రత్యేకత. అంతేకాదు యూజర్లు తమకు నచ్చినట్టు సౌండ్, లైట్ థీమ్ ను కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. పైగా ఈ ఫోన్ ను రూ.30వేల బడ్జెట్ కే అందుబాటులోకి తీసుకురావడం మరో ప్రత్యేకత.

 రియల్ మీ జీటీ 2 ప్రో
ఇది కూడా వెనుక భాగంలో కాస్త భిన్నంగా ఉంటుంది. పేపర్ స్ఫూర్తితో ఈ డిజైన్ అభివృద్ధి చేసినట్టు రియల్ మీ కంపెనీ తెలిపింది. దీన్ని వైట్ కాన్వాస్ గా ఉపయోగించుకోవచ్చు. పెన్సిల్ తో నచ్చింది రాసుకోవచ్చు. ఎరేజర్ తో చెరిపేసుకోవచ్చు. మ్యాటే రబ్బర్ ఫినిష్ టోన్ తో ఉండడంతో చక్కని గ్రిప్ ఉంటుంది. 

వివో వీ25 ప్రో
డిజైన్ పరంగా యూజర్ల కళ్లను ఆకర్షించే ఫోన్లలో వివో వీ25 ప్రో కూడా ఒకటి. బ్యాక్ కేస్ కలర్ మారే ఫీచర్ తో వస్తుంది. సూర్యరశ్మి పడినప్పుడు ఇలా కలర్ టోన్ మారిపోయి కనిపిస్తుంటుంది. దీంతో మీ చుట్టుపక్కల వారికి.. మీరు కొత్త ఫోన్ వాడుతున్నట్టు, ఫోన్ మార్చినట్టు అనుభూతి కలుగుతుంది. ఇది చాలా స్లీక్ గా, స్లిమ్ గా ఉంటుంది. 

పిక్సల్ 7, పిక్సల్ 6ఏ
గూగుల్ పిక్సల్ 7, పిక్సల్ 6ఏ సిరీస్ ఫోన్ల డిజైన్లు కూడా వినూత్నంగా కనిపిస్తాయి. పిక్సల్ 7, 7 ప్రో గ్లాసీ బ్యాక్ తో ఉంటాయి. ప్రీమియం లుక్ తో ఆకర్షణీయంగా ఉంటాయి. స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్ తో ఉండడం మరో ప్రత్యేకత. పిక్సల్ 6ఏ సైతం ఇదే విధమైన డిజైన్ తో ఉంటుంది.

 శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా
ఇది లగ్జరీ ఫోన్. వెనుక భాగంలో కెమెరా మ్యాడ్యూల్ ఉండదు. కేవలం సెన్సార్లనే ఏర్పాటు చేసింది. దీన్ని చేతిలో పెట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్ అనిపిస్తుంది.


More Telugu News