ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. విద్యుత్ వైర్ తెగి మీదపడడంతో కుప్పకూలిన టీటీఈ.. వీడియో ఇదిగో

ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాదం.. విద్యుత్ వైర్ తెగి మీదపడడంతో కుప్పకూలిన టీటీఈ.. వీడియో ఇదిగో
  • మరో వ్యక్తితో మాట్లాడుతుండగా ఘటన
  • వైరు మీద పడడంతో అలాగే ట్రాక్‌పై పడిపోయిన టీటీఈ
  • అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారన్న అధికారులు
  • వైరు తెగిపడడానికి పక్షులు కారణం కావొచ్చని అనుమానం
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే విషాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడింది. అది పడిన మరుక్షణమే ఆయన అలాగే ఒరిగిపోయి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. అతడితో మాట్లాడుతున్న వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. 

స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. బాధిత టీటీఈని సుజన్ సింగ్ సర్దార్‌గా గుర్తించారు. వెంటనే ఆయనను ఖరగ్‌పూర్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. సుజన్ తలతోపాటు ఆయన శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. 

ఈ ఘటనకు సంబంధించి ఖరగ్‌పూర్ టీఆర్ఎం మహమ్మద్ సుజత్ హష్మీ మాట్లాడుతూ.. వైరు తెగి పడడానికి కచ్చితమైన కారణం తెలియదని అన్నారు. గాయపడిన టీటీఈ ఆరోగ్యం అదృష్టవశాత్తు నిలకడగా ఉందని తెలిపారు. ఆయనతో తాము మాట్లాడినట్టు చెప్పారు. వైర్ ఎందుకు తెగిపడిందన్న దానిపై ఆయన మాట్లాడుతూ.. ఇందుకు బహుశా పక్షులే కారణం కావొచ్చని పేర్కొన్నారు.


More Telugu News