కలిసి ఉండడం అనేది కల్ల: సజ్జల వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ కౌంటర్

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పై సజ్జల సంచలన వ్యాఖ్యలు
  • రాష్ట్ర విభజన ముగిసిన అంశమన్న పొన్నం 
  • అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నామని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి తావు లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయం జరిగిందని అన్నారు. 

"దీనిపై సుప్రీం కోర్టులో కేసు ఉండొచ్చు, ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు... కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనప్పుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణపై మరోసారి దాడికి కుట్రగానే భావించాల్సి ఉంటుంది. 

ఆంధ్రా బాగుండాలి, తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలి. కానీ వైసీపీ ఉమ్మడి రాష్ట్రం అంటోందంటే, తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తోందనే అర్థం. అమరవీరుల ఆకాంక్షలకు, వారి ప్రాణత్యాగాలకు అనుగుణంగా, అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకోవాలే తప్ప, మళ్లీ కలిసుండాలనే అంశానికి ఎక్కడా తావివ్వకూడదు. 

నాడు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు ఏం కావాలంటే ఏమీ చెప్పకుండా ఇదే విధంగా వ్యవహరించారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుని, వికేంద్రీకరణ అంటూ ముందుకు వెళుతున్నారు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఉండొచ్చు, మళ్లీ కొత్త ప్రభుత్వాలు రావొచ్చు. 

ఏదేమైనా రాష్ట్ర విభజన అనేది ముగిసిన అంశం. కానీ మళ్లీ రెండు రాష్ట్రాలు కలవాలంటూ మాట్లాడడం అంటే కొత్త వివాదాలు రేకెత్తించడం, రాజకీయ లబ్ది పొందడం కోసమేనని భావించాల్సి ఉంటుంది" అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


More Telugu News