వైసీపీ-టీఆర్ఎస్ రాజకీయ డ్రామా మళ్లీ మొదలైంది: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ఉమ్మడి ఏపీకే తమ ఓటు అని సజ్జల వ్యాఖ్యలు
  • సుప్రీంలో ఎందుకు పిటిషన్ వేశారన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • వైసీపీది ఢిల్లీలో ఒక మాట, ఏపీలో మరో మాట అని విమర్శలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే తమ ఓటు అని, తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసిపోతే స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. 

వైసీపీ-టీఆర్ఎస్ రాజకీయ డ్రామా మళ్లీ మొదలైందని అన్నారు. ఏపీ-తెలంగాణ విభజన కేసులు మూసివేయాలంటూ సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీది ఢిల్లీలో ఒక మాట, ఆంధ్రా గల్లీలో మరొక మాట అని విమర్శించారు. 

అంతకుముందు సజ్జల మాట్లాడుతూ, రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పడమో, లేక సరిదిద్దడమో చేయాలని అన్నారు. తాము ఇప్పటికీ విభజనకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని వ్యాఖ్యానించారు.


More Telugu News