టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై ద్రావిడ్ ఏమన్నాడంటే...!

  • ఇటీవల టీమిండియాకు పరాజయాలు
  • న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే సిరీస్ ఓటములు
  • గాయాలు, పనిభారం ప్రభావం చూపుతున్నాయన్న ద్రావిడ్
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. వెస్టిండీస్, జింబాబ్వే వంటి జట్లపై సిరీస్ గెలిచినా, కీలక సిరీస్ లు, టోర్నీల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పేలవంగా ఉంది. నిన్న బంగ్లాదేశ్ చేతిలోనూ ఓటమిపాలై వన్డే సిరీస్ చేజార్చుకుంది. అంతకుముందు న్యూజిలాండ్ లోనూ ఓడిపోయింది. 

ఈ నేపథ్యంలో, టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. పూర్తిస్థాయి జట్టు ఇంకా అందుబాటులోకి రాలేదని వెల్లడించాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారని, అందుకే పలు సిరీస్ లకు వేర్వేరు జట్లను పంపించాల్సి వచ్చిందని వివరించాడు. ఆటగాళ్లపై పని భారం కూడా ప్రభావం చూపిస్తోందని అన్నాడు. 

గడచిన రెండేళ్లుగా టీ20 వరల్డ్ కప్ లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించామని, ఇక వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో, ఇకపై ఆ 50 ఓవర్ల ఫార్మాట్ పై దృష్టి సారిస్తామని ద్రావిడ్ తెలిపాడు. వచ్చే మూడు నెలల కాలం జట్టు సన్నాహాల పరంగా ఎంతో కీలక సమయం అని అభిప్రాయపడ్డాడు. భారత్ లో మూడు విదేశీ జట్లతో వన్డే సిరీస్ లు జరగనున్నాయని, వాటిలో పూర్తిస్థాయి జట్టును బరిలో దించుతామని చెప్పాడు.


More Telugu News