వీలైతే ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా విధానం: సజ్జల

  • విభజన అంశాలపై ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు
  • రెండు రాష్ట్రాలు కలిసిపోతే స్వాగతిస్తామన్న సజ్జల 
  • ఎక్కడైనా ఇదే మాట చెబుతామని స్పష్టీకరణ
రాష్ట్ర విభజన తీరుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వీలైతే ఏపీ మళ్లీ ఉమ్మడిగా ఉండాలన్నదే తమ పార్టీ విధానం అని, రెండు రాష్ట్రాలు కలిసిపోతే మొదట స్వాగతించేది వైసీపీయేనని సజ్జల స్పష్టం చేశారు. 

ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రానికే తమ ఓటు అని, ఏ వేదికపై అయినా ఇదే మాట చెబుతామని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం, పార్టీ వైఖరి ఇదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విభజనకు వ్యతిరేకంగా తమ వాదనలు స్పష్టంగా వినిపిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనను పునఃసమీక్షించాలని, లేదా, సరిదిద్దాలని కోరతామని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందని తెలిపారు. 

ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భంగా అనిపించాయని, పనిగట్టుకుని జగన్ వైపు వేలెత్తి చూపుతున్నట్టుగా అనిపించాయని సజ్జల పేర్కొన్నారు. ఉండవల్లి అలా ఎందుకన్నారో తనకైతే అర్థంకాలేదని అన్నారు. 

నాడు విభజన సమయంలో అన్యాయం చేసింది అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, విపక్షంలో ఉన్న బీజేపీ, వాళ్లకు పూర్తిగా ఇదైన టీడీపీ అని విమర్శించారు. కానీ వైసీపీ మాత్రం పూర్తిస్థాయిలో విభజనను వ్యతిరేకించిందని, చివరి వరకు పోరాడిందని సజ్జల వెల్లడించారు. 

విభజన అంశాలను ఇక వదిలేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని, ఎవరి ప్రయోజనం కోసం ఈ అఫిడవిట్ వేశారని ఉండవల్లి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, పోరాటం చేసి సీఎం అయిన జగన్ ఇప్పుడెందుకు వెనుకంజ వేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ఇప్పుడా విషయాన్నే విస్మరిస్తూ, విభజన గురించి వదిలేయండంటున్నారని విమర్శించారు.


More Telugu News