హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ విజయం.. మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యం

  • 22 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన ఠాకూర్
  • సెరాజ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి గెలుపొందిన నేత
  • 38 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఆధిక్యం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ గెలుపొందారు. సుమారు 22 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలోని సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ ఆధిక్యం సాధించారు. 2012 నుంచి ఠాకూర్ సెరాజ్ నుంచే పోటీ చేసి గెలుస్తున్నారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జైరామ్ ఠాకూర్ కు 35,519 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థి చేత్ రామ్ కు 24,265 మంది ఓటేశారు. సెరాజ్ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత దక్కేలా కనిపిస్తోంది. ఉదయం నుంచి నువ్వా నేనా అన్నట్లు రెండు పార్టీల ఫలితాలు వెలువడగా.. మధ్యాహ్నానికి ట్రెండ్ మారింది. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందగా.. మరో 13 చోట్ల బీజేపీ, 27 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైనట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


More Telugu News