మరో 385 మందిని తొలగించిన వేదాంతు కంపెనీ

  • ఈ ఏడాదిలో మొత్తం 1,100 మంది ఉద్యోగులపై వేటు
  • సగం జీతమే తీసుకుంటున్న ఉన్నతస్థాయి ఉద్యోగులు
  • ఇదే బాటలో బైజూస్ సహా దేశంలోని ఎడ్యుటెక్ కంపెనీలు
ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు మరోమారు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. ఈసారి 385 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. సేల్స్, హెచ్ ఆర్ విభాగాల్లోని ఈ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చినట్లు సమాచారం. పెరిగిపోతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకుని, సంస్థను లాభాల్లోకి నడిపించే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా తొలగింపులతో ఈ ఏడాది వేదాంతు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 1,100 లకు చేరింది. 

ఈ ఏడాది జులైలో వంద మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 624 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వేదాంతు తొలగించింది. దీంతో ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,300 మందికి తగ్గింది. వేదాంతు సహ వ్యవస్థాపకుడితో పాటు సీనియర్ ఉద్యోగులు చాలామంది తమ జీతాల్లో 50 శాతం కోత విధించుకున్నారు.

మరోవైపు, బైజూస్ సహా భారత్ లోని ఎడ్యుటెక్ కంపెనీల్లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అక్టోబర్ లో బైజూస్ తన ఉద్యోగులలో 2,500 మందిని ఇంటికి సాగనంపింది. గత నెలలో మరో 350 మంది ఉద్యోగులను తొలగించింది.


More Telugu News