మరికాసేపట్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఫలితాలపై ఉత్కంఠ

  • ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • మధ్యాహ్నానికి తెలిసిపోనున్న ఫలితాల సరళి
  • హిమాచల్ ప్రదేశ్‌పై కాంగ్రెస్ ఆశలు
  • గుజరాత్ మళ్లీ బీజేపీదే!
  • మూడో స్థానానికి పరిమితం కానున్న ‘ఆప్’
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన దాని ప్రకారం..  27 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ రెండు, ఆప్ మూడో స్థానంలో నిలుస్తాయి. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదు. అలాగే, ఈ ఎన్నికలతోపాటు ఐదు రాష్ట్రాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు, ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.

ఇక గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలుండగా 1,621 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌లో 68 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 35. 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. దీంతో ఈసారి గెలుపుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.


More Telugu News