69 రన్స్ కే 6 వికెట్లు డౌన్... అయినా భారీ స్కోరు చేసిన బంగ్లాదేశ్

  • నేడు భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా
  • 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు
  • సెంచరీ సాధించిన మెహిదీ హసన్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా
టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు అద్భుత ఆటతీరు కనబర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఓ దశలో 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ పుంజుకుని భారీ స్కోరు సాధించింది. బౌలింగ్ ఆల్ రౌండర్ మెహిదీ హసన్ అసమాన పోరాటంతో సెంచరీ సాధించగా, మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి దృఢసంకల్పంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. 

మెహిదీ హసన్ సరిగ్గా 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. మెహిదీ హసన్ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. అతడి స్కోరులో 8 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. నసూమ్ అహ్మద్ 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. 

అంతకుముందు బంగ్లాదేశ్ ఓపెనర్లిద్దరినీ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. అనాముల్ హక్ 11 పరుగులు చేయగా, కెప్టెన్ లిట్టన్ దాస్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 8 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 21, ముష్ఫికర్ రహీమ్ 12 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీశారు. 

కాగా, తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ జట్టు ఇదే తరహా పోరాట పటిమ చూపింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా, ఆ మ్యాచ్ లో భారత్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, మెహిదీ హసన్ పోరాటస్ఫూర్తితో ఆడి భారత్ కు విజయాన్ని దూరం చేశాడు. ఆ మ్యాచ్ లో 38 పరుగులతో అజేయంగా నిలిచిన మెహిదీ హసన్ నేటి మ్యాచ్ లో ఏకంగా సెంచరీ సాధించడం విశేషం. 

మెహిదీ ఇప్పటిదాకా స్పిన్నర్ గానే ఫేమస్. కానీ టీమిండియా బౌలింగ్ డొల్లతనాన్ని ఉపయోగించుకుని తన బ్యాటింగ్ రికార్డును మరింత మెరుగుపర్చుకుంటున్నాడు. ఏదేమైనా టీమిండియా బౌలింగ్ లోపాలను ఈ రెండు మ్యాచ్ లు ఎత్తిచూపుతున్నాయి. టెయిలెండర్ల వికెట్లు తీయలేని బలహీనతను భారత్ మరోసారి చాటుకున్నట్టయింది.


More Telugu News