రివర్స్ ట్రెండ్.. ఓటీటీలో వచ్చిన తర్వాత థియేటర్లలోకి వెంకటేశ్​ సినిమా రిలీజ్

  • ఈ నెల 13న వెంకటేశ్ పుట్టిన రోజు
  • ఈ సందర్భంగా నారప్ప సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం
  • ఓటీటీలోకి వచ్చాక తిరిగి థియేటర్లలోకి వస్తున్న తొలి చిత్రం ఇదే
సాధారణంగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు కొన్ని రోజుల తర్వాత ఓటీటీలోకి రావడం సహజం. థియేటర్లలో సినిమా చూడని వాళ్లు ఎంచక్కా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెంట్ నడుస్తోంది.  కానీ, విక్టరీ వెంకటేశ్ చిత్రం రివర్స్ ట్రెండ్ సృష్టించనుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ కల్చర్ పెరగడమే ఇందుకు కారణం అవుతోంది.  స్టార్ హీరోలు తమ పుట్టిన రోజులకు సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని జోష్‌లో నింపుతున్నారు.  ఇప్పుడు వెంకటేష్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. డిసెంబర్ 13న ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు సురేశ్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.  

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది కరోనా లాక్ డౌన్  కారణంగా  అమెజాన్ ప్రైమ్‌లో  విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలని ఆశించిన అభిమానుల కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. వెంకీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘నారప్ప’ని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ చిత్రం థియేటర్లలో చూడొచ్చని సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. దాంతో, వెంకీ అభిమానులందరికీ ఇది శుభవార్త అనొచ్చు. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్‌లో విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దాంతో, వెంకటేశ్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.


More Telugu News