కాషాయ పార్టీకి రాంరాం చెప్పేసిన తమిళనాడు బీజేపీ బహిష్కృత నేత

  • ఈ ఏడాది మేలో బీజేపీలో చేరిన తిరచ్చి సూర్య శివ
  • సహచర మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో బీజేపీ వేటు
  • బీజేపీ తమిళనాడు చీఫ్‌పై ప్రశంసలు
సహచర మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తిరుచ్చి సూర్య శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఓబీసీ విభాగం మాజీ నాయకుడైన సూర్య శివ నిన్న ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి ఆయన అతిపెద్ద నిధి అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రెండంకెల లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరో ట్వీట్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశవ వినాయగంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ లక్ష్యానికి ఆయన అడ్డుగా ఉన్నారని, ఆయనను మారిస్తే తప్ప బీజేపీ తన లక్ష్యాన్ని సాధించలేదని అన్నారు. ఆయనను తక్షణమే మార్చాలని అన్నామలైని కోరారు. అలాగే, అన్నామలైకి రాసిన లేఖను కూడా ఆయన షేర్ చేశారు. అన్నామలై నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్న ఆయన.. అన్నామలైని భారత ప్రధానిగా అంచనాల్లోకి తీసుకోవచ్చన్నారు. 

డీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ కుమారుడే సూర్య. ఆరు నెలల్లో ఆయన రెండో పార్టీని వీడారు. ఈ ఏడాది మే నెలలో డీఎంకేను వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీని కూడా విడిచిపెట్టారు. ఇప్పుడాయన ఏ పార్టీలో చేరుతారన్నది ఆసక్తిగా మారింది.


More Telugu News