ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇవ్వడమేనా బీసీల సంక్షేమం?: చంద్రబాబుపై బొత్స విమర్శలు

  • రేపు విజయవాడలో బీసీ సభ
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
  • మీడియాతో మాట్లాడిన బొత్స
  • బీసీలకు న్యాయం చేసింది జగన్ ఒక్కడేనని వెల్లడి
రేపు (డిసెంబరు 7) విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. కాగా ఈ సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఏపీ మంత్రులు బొత్స, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరి జయరాం తదితరులు పరిశీలించారు. 

ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడేనని వెల్లడించారు. బీసీలు ఇవాళ మార్కెట్ కమిటీ పదవుల నుంచి రాజ్యసభ పదవుల వరకు పొందారంటే అందుకు కారణం జగన్ అని స్పష్టం చేశారు. ఇకపైనా బీసీలకు మరింత మేలు చేయడం గురించే జగన్ ఆలోచిస్తున్నారని వివరించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, అమ్మ ఒడి పథకాలతో బీసీల జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని బొత్స పేర్కొన్నారు. 

మరి, చంద్రబాబు బీసీలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇచ్చినంతనే బీసీ సంక్షేమం అయిపోతుందా? అని అన్నారు. "మంత్రులుగా మాకు అధికారం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు మా బలహీన వర్గాలను అవమానించడమే" అని పేర్కొన్నారు.


More Telugu News