సీపీఎస్ సమావేశానికి ఉద్యోగ సంఘాలు దూరం

  • సీపీఎస్ రద్దుకు జగన్ హామీ ఇచ్చారంటున్న ఉద్యోగ సంఘాలు
  • నేడు సీపీఎస్ సమావేశం ఏర్పాటు
  • హాజరుకాని ఉద్యోగ సంఘాలు
  • ఓపీఎస్ పై చర్చిస్తేనే వస్తామన్న బొప్పరాజు
  • మంత్రులు జీపీఎస్ అంటున్నారని అసంతృప్తి
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, సమావేశానికి రావాలని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఓపీఎస్ పై చర్చిస్తేనే సమావేశానికి వస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. 

దీనిపై ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ, తాము సీపీఎస్ సమావేశానికి హాజరు కావడంలేదని స్పష్టం చేశారు. ఓపీఎస్ పై చర్చిస్తేనే వస్తామని గత సమావేశంలోనే చెప్పామని వెల్లడించారు. తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంటోందని, ప్రభుత్వం ఏం చెబితే అది వింటున్నామని తమపై ఉద్యోగుల్లో ఓ భావన నెలకొందని బొప్పరాజు తెలిపారు. 

సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీ నెరవేర్చాలని తాము కోరుతున్నామని పేర్కొన్నారు. మంత్రులు మాత్రం జీపీఎస్ అంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారని, మరి తాము ఉద్యోగుల మాట నమ్మాలా? లేక మంత్రుల సంఘం మాటలు నమ్మాలా? అని బొప్పరాజు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఇబ్బందికర వాతావరణంలో చిక్కుకున్నాయని అభిప్రాయపడ్డారు.


More Telugu News