స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికపై ముఖ్యమంత్రి స్పందించాలి: బొండా ఉమ డిమాండ్

  • ఏపీలో 18,267 కిలోల డ్రగ్స్ దొరికాయని నివేదికలో పేర్కొన్నారన్న ఉమ 
  • ఉత్తరాంధ్ర ఏజెన్సీని గంజాయి డెన్ గా మార్చిన ఘనుడు విజయసాయిరెడ్డి అంటూ విమర్శ 
  • జగన్ రెడ్డి కలెక్షన్లలో మునిగి తేలుతున్నారని విమర్శ 
డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ వన్ అంటూ స్మగ్లింగ్ ఇండియా ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పాలని టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్ చేశారు. ఏపీలో 18,267 కిలోల డ్రగ్స్ దొరికాయని నివేదికలో ఉందని అన్నారు. ఈ నివేదికపై జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని... సజ్జలో, బిజ్జలో చెబుతామంటే ఊరుకునేది లేదని అన్నారు. 

ఏపీ నుంచి దేశ నలుమూలలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని బొండా ఉమ చెప్పారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు అడ్డాగా మార్చారని... ఈ ప్రాంతాన్ని గంజాయి డెన్ గా మార్చిన ఘనుడు విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా ఏపీ పేరే వినిపిస్తోందని... జగన్ రెడ్డేమో కలెక్షన్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. జే గ్యాంగ్ కుంభకోణాలు, దందాలు, సెటిల్మెంట్లతో పోగేసిన సొమ్ముని పొరుగు రాష్ట్రాల్లో దాస్తే, నిఘాసంస్థలు కనిపెట్టలేవా? అని ఎద్దేవా చేశారు. 

సంకల్పసిద్ధి సంస్థ ద్వారా గొలుసుకట్టు పద్ధతిలో అమాయక ప్రజలను మోసగించి, కోట్లు కొల్లగొట్టారని అర్థమవుతోందని అన్నారు. సంకల్పసిద్ధి కుంభకోణం సొమ్మేకాదు, రియల్ ఎస్టేట్, సెటిల్ మెంట్ల దందాతో ఏపీలో వైసీపీ నేతలు పోగేసిన సొమ్మంతా ఇతర రాష్ట్రాలకు చేరిందని అన్నారు. పేదల్ని దోచుకున్న సొమ్ముతో హైదరాబాద్, బెంగుళూరులాంటి చోట్ల వైసీపీ నేతలు పెట్టిన పెట్టుబడులు ఐటీ, ఈడీ సోదాల ద్వారా బయటపడుతున్నాయని చెప్పారు. 

వందలు, లక్షల కోట్లు సంపాదించడానికి వైసీపీ నేతల తాతలు, తండ్రులు ఏమైనా పుట్టుకతో జమీందారులా? ఏం వ్యాపారాలు చేసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారో చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరి నుంచి ఎవరికి వెళ్లిందనే వివరాలను దర్యాప్తు సంస్థలు బయటపెట్టాలని కోరుతున్నామని అన్నారు. దేవినేని నెహ్రూ కొడుకు అవినాశ్, వల్లభనేని వంశీనే కాదు, ఇంకా చాలా పెద్ద బ్యాచ్ ఉందని... అలీబాబా దొంగల ముఠాలోని వారు దొరికితే, వారి వెనకున్న పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్పారు.


More Telugu News