భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించి.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తి!

  • ఏనుగు విగ్రహం కింద నుంచి దూరేందుకు ప్రయత్నించిన వ్యక్తి
  • వైశాల్యం తక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయి బయటకు రాలేక అవస్థలు
  • భక్తి ఎక్కువైనా ఇబ్బందేనంటూ నెటిజన్ల కామెంట్లు
దేవుడి పట్ల భక్తిని చాటుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రతి వ్యక్తి తన శక్తికి తగినట్టు దేవుడిని ఆరాధించుకోవచ్చు. గుడికి వెళ్లి దండం పెట్టుకోవచ్చు. ప్రదక్షిణాలు చేయవచ్చు. పూజలు, అభిషేకాలు చేయించుకోవచ్చు. వీలైతే భక్తులకు అన్నదానం చేయవచ్చు. గుడి ఆవరణను శుభ్రం చేయవచ్చు. ఇవన్నీ భక్తిని చాటుకునే చర్యలు. కానీ, భక్తి పేరుతో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేయడం సమస్యలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ గా మారింది. సదరు వీడియోలో ఓ వ్యక్తి ఏనుగు విగ్రహం కింద నుంచి దూరే ప్రయత్నం చేయడాన్ని చూడొచ్చు. కానీ, వ్యక్తి పట్టేంత స్థలం ఏనుగు విగ్రహం కింద లేదు. అయినా కానీ, ఆ వ్యక్తి ధైర్యం చేసి అటు నుంచి ఇటు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, దాని కింద ఇరుక్కుపోయి ముందుకు రాలేక, వెనక్కి పోలేక దేవుడా అంటూ ఆర్తనాదాలు చేయడం గమనించొచ్చు. ఈ ఆలయం ఎక్కడన్నది వీడియోలో లేదు. మరి చివరికి ఆ వ్యక్తి ఏనుగు విగ్రహం కింద నుంచి బయటపడ్డాడా? లేదా? అన్నది కూడా తెలియదు. 

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. భక్తి ఎక్కువైనా ముప్పేనంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. నిజమే భక్తికి కూడా ఓ అర్థం ఉండాలి కదా. ఓ వ్యక్తి అయితే, ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని అమరకాంతక్ నర్మదా మందిర్ కు సంబంధించినదిగా కామెంట్ రూపంలో తెలిపారు. పాపం చేసిన వారు దాని కింద ఇరుక్కుపోతారన్నది అక్కడి వారి నమ్మకమట!


More Telugu News