చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ మరణాలకు కారణాలివే..!

  • థైరాయిడ్ గ్రంధిలో లోపాలు ఉండొచ్చు
  • తగినంత నిద్ర లేకపోతే గుండెకు ముప్పు
  • ఆహారం, ఒత్తిడుల పాత్ర ఎంతో
కరోనా తర్వాతి కాలంలో చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ మరణాల వార్తలు అధికంగా వింటున్నాం. పునీత్ రాజ్ కుమార్ సహా 50లోపు వయసున్న పలువురు సెలబ్రిటీలు సైతం అకాల మరణం చెందారు. నడుస్తూ, నృత్యం చేస్తూ, వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్న కేసులు పెరుగుతున్నాయి. దీనిపై డాక్టర్ ఎడ్మండ్ క్లయింట్ ఫెర్నాండెజ్ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు.  

గుండెకు-థైరాయిడ్ కు మధ్య సంబంధం
గుండె పనితీరులో థైరాయిడ్ గ్రంధి ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. థైరాయిడ్ లోపం ఉంటే గుండె జబ్బులకు దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోతే అది గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతుంది. అందుకని కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే వైద్యులను సంప్రదించాలి.

నిద్ర-గుండె జబ్బులు
నిద్ర లేమి అధిక రక్తపోటుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ కూడా నిద్రలేమి వల్ల పెరుగుతుంది. హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది. ఒకే విధమైన నిద్ర వేళలు కొనసాగించడం ఎంతో అవసరం. కనీసం 8 గంటల పాటు గాఢమైన నిద్ర కావాలి. 6-7 గంటల నిద్ర సరిపోతుందనే మాటలను నమ్మొద్దు. నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్లు, టీవీల్లో సినిమాలు, వీడియోల వీక్షణకు దూరంగా ఉండాలి. 

పని ఒత్తిడులు, దిగులు - గుండె జబ్బులు
దీర్ఘకాలంగా ఒత్తిడి, దిగులు, ఆందోళన వల్ల అది సహజంగానే గుండెకు రక్త ప్రసారాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా జీవక్రియల్లో మార్పులు వస్తాయి. చివరికి గుండె జబ్బులు కనిపిస్తాయి. పని ప్రదేశాల్లో, వ్యక్తిగతంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటే అది గుండె జబ్బులకు దారితీయవచ్చు. 

ఆహారం
ఆకు కూరలు, పండ్లు, వాల్ నట్, గ్రీన్ టీ మంచి ఫలితాలు ఇస్తాయి. కేవలం ఆహారంలోనే మార్పులు కాకుండా, జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంటూ మనకోసం సమయాన్ని కేటాయించుకోవడం ముఖ్యం. రోజూ 30 నిమిషాల పాటు నడవాలి.

ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్, బాగా నూనె వేసిన, ఫ్రై చేసిన ఆహారం, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. పొగతాగడం మానేయాలి. ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.


More Telugu News