తాజ్ మహల్ లో పరిశోధనకు ఆదేశాలివ్వలేం: సుప్రీంకోర్టు

  • 400 ఏళ్లుగా ఉంది.. తాజ్ మహల్ ను అలాగే ఉండనివ్వాలని వ్యాఖ్య
  • ఆర్కియలాజికల్ సర్వే సంస్థకు విజ్ఞప్తి చేసుకోవాలని పిటిషనర్ కు సూచన
  • పబ్లిసిటీ కోసం పిటిషన్ వేసి కోర్టు సమయం వృథా చేశారని ఆగ్రహం
  • పిటిషనర్ కు రూ.లక్ష జరిమానా
ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ విషయంలో, దాని చరిత్ర విషయంలో కల్పించుకోలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. నాలుగు వందల ఏళ్లు గడిచిన తర్వాత తాజ్ చరిత్రపై ఇప్పుడు పరిశోధన జరపాలంటూ ఆదేశాలివ్వలేమని పేర్కొంది. తాజ్ మహల్ లోపల పరిశోధనలు జరిపి, ఆ కట్టడం పూర్వ రూపం ఏంటనేది వెల్లడించేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తాజ్ మహల్ 400 ఏళ్లుగా అక్కడే ఉంది.. దానిని అలాగే ఉండనివ్వాలని పిటిషనర్ కు సూచించింది. 

మొఘలుల కాలం నాటి కట్టడం తాజ్ మహల్ చరిత్రపై నెలకొన్న సందేహాలను తీర్చేలా, తాజ్ మహల్ లోపల పరిశోధనలు జరిపించి వాస్తవాలను బయటపెట్టేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. డాక్టర్ సచ్చిదానంద పాండే అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే, కోర్టు దీనికి నిరాకరించింది. ఈ విషయంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసుకోవాలని, తాజ్ చరిత్రపై పరిశోధన చేయాలా? వద్దా? అనేది ఆ సంస్థకే వదిలేయాలని పేర్కొంది. ఈ విషయంలోకి కోర్టును లాగొద్దని పిటిషనర్ కు సూచించింది. పబ్లిసిటీ కోసం అనవసరమైన పిల్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్ కు రూ. లక్ష జరిమానా విధించింది.


More Telugu News