చిక్కుల్లో ఎలాన్ మస్క్ ‘న్యూరా లింక్’.. ప్రయోగాల్లో జంతు మరణాలు

  • దర్యాప్తు చేయనున్న యూఎస్ ఎఫ్ డీఏ
  • హడావిడిగా ప్రయోగాలతో చెడు ఫలితాలు
  • మనిషి మెదళ్లలో ప్రవేశపెట్టేందుకు అనుమతి రావడం ఇప్పట్లో సందేహమే
ఎలాన్ మస్క్ కు చెందిన వైద్య పరికరాల స్టార్టప్ ‘న్యూరాలింక్’ పెద్ద చిక్కుల్లో పడింది. మెదడులో ప్రవేశపెట్టగలిగే ఇంప్లాంట్లను (కాయిన్ సైజు చిన్న పరికరం) న్యూరాలింక్ అభివృద్ధి చేసింది. దీని సాయంతో పక్షవాతం వచ్చి నడవలేని, వెన్నుముక దెబ్బతిన్న వారిని సైతం నడిపిస్తామని ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు. మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్లను పనిచేయించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 

ఈ ఇంప్లాంట్లను ఇప్పటికే కోతుల్లో ప్రవేశపెట్టి చూడగా, కొన్ని సానుకూల ఫలితాలు కూడా వచ్చాయి. దీంతో ఎఫ్ డీఏ ఆమోదం కోసం న్యూరాలింక్ దరఖాస్తు చేసుకుంది. ఎఫ్ డీఏ ఆమోదం లభిస్తే మనిషి మెదళ్లలో వీటిని ప్రవేశపెట్టి చూడాలన్నది న్యూరాలింక్ సంకల్పం. తాను సైతం ఒక చిప్ ఏర్పాటు చేయించుకుంటానని మస్క్ ప్రకటించారు. కానీ, తీరా చూస్తే ఈ ప్రయోగాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎఫ్ డీఏ నుంచి ఇప్పట్లో అనుమతులు రావడం సందేహంగానే అనిపిస్తోంది. 

పలు జంతువుల చనిపోయాయంటూ ఆరోపణలు రావడంతో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జంతు సంరక్షణ చట్టాల ఉల్లంఘన జరిగిందని, కొన్ని జంతువులు చనిపోయాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. న్యూరాలింక్ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులు ఎలాన్ మస్క్ నుంచి వస్తున్న పని ఒత్తిడిపైనా అసంతృప్తిగా ఉన్నారు. ఇది కూడా ప్రయోగాల విఫలానికి, జంతు మరణాలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 1,500 వరకు జంతువులు చనిపోయినట్లు సమాచారం. వీటిల్లో గొర్రెలు, పందులు, కుందేళ్లు, ఎలుకలు, కోతులు ఉన్నాయి.


More Telugu News