తుపానుగా మారనున్న అల్పపీడనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ

  • దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • నేడు వాయుగుండంగా, తుపానుగా మారనున్న వైనం
  • తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు
  • జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు
తమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను పొంచి చూస్తోంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది. ఈ నేపథ్యంలో జాలర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చేపల వేటకు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. 

నేటి సాయంత్రం పశ్చిమ, వాయవ్య దిశల్లో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలో చెదురుమదురు వానలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏర్పడబోయే తుపానుకు ‘మాండస్’ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేరు పెట్టింది.

తుపాను ఈ నెల 7, 8 తేదీల్లో తీరంవైపు దూసుకొస్తుందని అధికారులు తెలిపారు. అయితే, తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్న విషయాన్ని 8న అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. కాగా, మాండస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడే అవకాశం ఉంది.


More Telugu News