అడివి శేష్ సక్సెస్ అదే: సత్యదేవ్

  • సత్యదేవ్ హీరోగా రూపొందిన 'గుర్తుందా శీతాకాలం' 
  • ముగ్గురు హీరోయిన్లతో నడిచే ప్రేమకథ 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన అడివి శేష్ 
  • ఆయన రాకవలన తమ సినిమా హిట్ కొడుతుందన్న సత్యదేవ్
ఒక వ్యక్తి తన జీవితంలో వివిధ దశలలో .. వివిధ సందర్భాలలో ప్రేమలో పడటం అనే కథాంశంతో గతంలో కొన్ని కథలు తెలుగు తెరను పలకరించాయి. అలాంటి ఒక కథతోనే సత్యదేవ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాపేరే .. 'గుర్తుందా శీతాకాలం'. భవాని రవి - రామారావు నిర్మించిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. 

తమన్నా .. మేఘ ఆకాశ్ .. కావ్య శెట్టి కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో సత్యదేవ్ మాట్లాడుతూ .. " శేష్ ఎంత కష్టపడతాడో .. ఎంత ప్రాణం పెడతాడో నేను కళ్లారా చూశాను. ఆయనకి కథ చెప్పినవారు .. ఆ తరువాత నా దగ్గర ఆ ప్రస్తావన తెచ్చేవారు. 

'శేష్ ఏంటి అన్ని ప్రశ్నలు అడుగుతాడు? .. బుర్రతిని పారేస్తాడు .. ఒక పట్టాన వదిలిపెట్టడు' అని నాతో అంటూ ఉండేవారు. నేను కూడా అవునా అనుకునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది .. అదే శేష్ సక్సెస్. అందువల్లనే ఆయన వరుస సక్సెస్ లను అందుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలు తను టచ్ చేస్తే హిట్ అవుతాయి. ఆయన గెస్టుగా వచ్చాడు కనుక ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News