తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించిన అల్లు అరవింద్

  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2 టాక్ షో
  • హాజరైన అల్లు అరవింద్, సురేశ్ బాబు, రాఘవేంద్రరావు
  • థియేటర్ల నిర్వహణ ఓనర్లకు భారంగా మారిందన్న అరవింద్
  • తాము కోట్ల రూపాయలతో థియేటర్లను తీర్చిదిద్దినట్టు వివరణ
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు సంబంధించి కీలక అంశాలు వెల్లడించారు. 

థియేటర్లు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్న సమయంలో ఓనర్లు నిస్సహాయత వ్యక్తం చేశారని తెలిపారు. థియేటర్లను యథావిధిగా నడిపించడం అటుంచితే, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు చెల్లించి సినిమాలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. 

దాంతో థియేటర్ల నిర్వహణ పెనుభారంగా మారడంతో, థియేటర్లను మీరే నిర్వహించి, ఏటా మాకు కొంత మొత్తం ఇవ్వండి అని థియేటర్ల యజమానులు నిర్మాతలను కోరారని అల్లు అరవింద్ వివరించారు. ఆ విధంగా తాము థియేటర్లను తీసుకుని వాటికి అన్ని హంగులు కల్పించామని తెలిపారు. 

ఆధునికీకరణ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. థియేటర్ల ఆధునికీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అన్ని రకాల సదుపాయాలతో వాటిని ముస్తాబు చేశామని అరవింద్ పేర్కొన్నారు. దాని ఫలితంగానే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడమే కాకుండా, కలెక్షన్లు కూడా పెరిగాయని వివరించారు. 'ఆ విధంగా మీవంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయగలుగుతున్నాం' అని బాలకృష్ణతో చెప్పారు.


More Telugu News