నేడు లాలూ ప్రసాద్ కు కీలకమైన కిడ్నీ మార్పిడి సర్జరీ

  • సింగపూర్ లోని హాస్పిటల్ లో చేరిన లాలూ, ఆయన కుమార్తె రోహిణి
  • రోహిణి నుంచి కిడ్నీ తొలగింపు శస్త్రచికిత్స విజయవంతం
  • ఫేస్ బుక్ లో ప్రకటించిన ఆమె సోదరి మీసా భారతి
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు నేడు సింగపూర్ లో కీలకమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. లాలూకు ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేస్తున్నారు. రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ తీసే శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినట్టు ఆమె సోదరి, లాలూ పెద్ద కుమార్తె మీసా భారతి ప్రకటించారు. ఐసీయూలో రోహిణి చికిత్స పొందుతున్న ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. రోహిణి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు తెలిపారు.

లాలూ ప్రసాద్ ను స్ట్రెచర్ పై తీసుకెళుతున్న ఫొటోలను సైతం మీసా భారతి షేర్ చేశారు. అంతకుముందు హాస్పిటల్ లో లాలూతో కలసి ఉన్న ఫొటోలను రోహిణి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ‘రెడీ టూ రాక్ అండ్ రోల్. మంచి జరగాలని విష్ చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. లాలూ, రోహిణి ఇద్దరూ ఆదివారం హాస్పిటల్ లో చేరారు. కిడ్నీ మార్పిడి చికిత్సకు ముందు వీరికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. అందుకే ఒక రోజు ముందు చేరారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీలు చెడిపోవడంతో శస్త్రచికిత్స అనివార్యం అయింది. రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేస్తే సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందని వైద్యులు చెప్పడంతో లాలూ కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు.


More Telugu News