దగ్గుబాటి రానాకి క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్

  • తన లగేజీ కనిపించకుండా పోవడంపై రానా అసహనం
  • దీనిపై ఎయిర్ లైన్స్ సిబ్బందికి అవగాహన లేదంటూ విమర్శ
  • వీలైనంత త్వరగా అందిస్తామంటూ బదులిచ్చిన ఇండిగో
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగోపై నటుడు దగ్గుబాటి రానా అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ సర్వీసెస్ సేవలు చెత్త అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సర్వీసుల వేళలపై ఇండిగోకు కనీస అవగాహన లేదని రానా విమర్శించారు. తన లగేజీ కనిపించడం లేదని పేర్కొంటూ, ఎయిర్ లైన్స్ సిబ్బందికి దీని గురించి తెలియకపోవడాన్ని తప్పుబట్టారు.  

ట్విట్టర్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్వహణను తన ట్వీట్ ద్వారా రానా కళ్లకు కట్టారు. ‘‘భారత్ దేశంలోనే అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ సర్వీస్ అనుభవం. ఇండిగో.. ఫ్లయిట్ టైమింగ్ గురించి తెలియదు. పోయిన లగేజ్ ను గుర్తించలేరు... సిబ్బందికి దీని గురించి తెలియదు. ఇంతకంటే దిక్కుమాలిన సేవ ఉంటుందా? అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

రానా ఘాటు వ్యాఖ్యలకు ఇండిగో స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ‘‘మీ లగేజీని వీలైనంత త్వరగా మీకు చేరేలా చూసేందుకు మా సిబ్బంది చురుగ్గా పనిచేస్తున్నారంటూ’’ రిప్లయ్ ఇచ్చింది. దీంతో రానా తన ట్విట్టర్ హ్యాండిల్ పై ట్వీట్ ను తొలగించినట్టు తెలుస్తోంది.


More Telugu News