కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: షర్మిల

  • తన పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్న షర్మిల
  • పోలీసులు కేసీఆర్ కోసం పని చేస్తున్నారని మండిపాటు
  • అవినీతి గురించి మాట్లాడుతున్నందుకు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్య
తన పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. తనకు కేసీఆర్ నుంచి, ఆయన గూండాల నుంచి ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్ర కేసీఆర్ రాజకీయాలకు అంతిమయాత్ర అవుతుందని అన్నారు. 

ఇప్పటి వరకు తన పాదయాత్రను మూడు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని షర్మిల చెప్పారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా... కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను ముఖ్యమంత్రి పనివాళ్లుగా వాడుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతిని ఇచ్చినప్పటికీ... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. 

నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే... తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగించామని కేసులు నమోదు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరంను ఏర్పాటు  చేయాలని... వారి అక్రమాలను, అవినీతిని తాను అక్కడే నిరూపిస్తానని సవాల్ విసిరారు.


More Telugu News