నైజీరియా మసీదులో 12 మందిని కాల్చి చంపిన దుండగులు.. పలువురి అపహరణ

  • అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన కట్సినాలో ఘటన 
  • మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు 
  • ప్రార్థనలు చేస్తున్న వారిపై యథేచ్ఛగా కాల్పులు
  • మృతుల్లో మసీదు ప్రధాన ఇమామ్ 
దారుణాలకు నెలవైన నైజీరియాలో సాయుధుల మారణహోమానికి అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా ఓ మసీదులోకి చొరబడిన దుండగులు.. ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. అనంతరం పలువురిని బందీలుగా తీసుకెళ్లారు. నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడిచేసి చంపేయడమో, కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారింది. అంతేకాక, రైతులు పంటలు పండించుకోవాలన్నా, వాటిని రక్షించుకోవాలన్నా ఈ ముఠాలకు ‘ప్రొటెక్షన్ ఫీ’ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిందే.

తాజా విషయానికి వస్తే.. అధ్యక్షుడు ముహమ్మదు బుహారి సొంత రాష్ట్రమైన కట్సినాలో ఈ ఘటన జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్దకు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో హాహాకారాలు మొదలయ్యాయి. భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. రాత్రి ప్రార్థనలకు వచ్చిన వారిలో 12 మంది వారి తూటాలకు బలయ్యారు. వీరిలో మసీదు ప్రధాన ఇమామ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ ఒక్క చోట చేర్చిన దుండగులు అపహరించుకుపోయారు.  

కట్సినా స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి గంబో ఇసా ఈ ఘటనను ధ్రువీకరించారు. స్థానికుల సాయంతో కిడ్నాప్‌కు గురైన వారిలో కొందరిని రక్షించినట్టు చెప్పారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని కట్సినా సహా పలు రాష్ట్రాలు నైగర్‌ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సాయుధ ముఠాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. బందిపోట్ల శిబిరాలపై నైజీరియా మిలటరీ దాడులు చేస్తున్నా వారి ఆగడాలకు మాత్రం చెక్ పడడం లేదు.


More Telugu News