మారడోనా, రొనాల్డో రికార్డును బద్దలు కొట్టిన మెస్సీ

  • ప్రపంచ కప్ టోర్నీల్లో 9 గోల్స్ సాధించిన అర్జెంటీనా స్టార్
  • చెరో 8 గోల్స్ తో  ఉన్న మారడోనా, రొనాల్డోలను దాటిన వైనం
  • కెరీర్ లో 1000వ మ్యాచ్ ఆడేసిన లియోనల్ మెస్సీ
అర్జెంటీనా ఫుట్ బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 2–1తో విజయం సాధించగా.. ఈ పోరులో మెస్సీ కీలక గోల్ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మెస్సీ మూడు గోల్స్ సాధించాడు. వరల్డ్ కప్ నాకౌట్ దశలో అతనికి ఇది తొలి గోల్. ప్రపంచ కప్స్ లో ఓవరాల్ గా అతనికి ఇది 9వ గోల్ కావడం విశేషం. దాంతో, ప్రపంచ కప్ టోర్నీల్లో ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాలోతో పాటు తమ దేశానికి చెందిన దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు. మారడోనా, రొనాల్డో చెరో ఎనిమిదేసి గోల్స్ సాధించారు. 

ఇక, అర్జెంటీనా తరపున ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో మారడోనాను దాటిన మెస్సీ రెండో స్థానానికి చేరుకొన్నాడు. అర్జెంటీనా తరపున ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో గాబ్రియెల్ బటిస్టుటా (10) అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్ తో మెస్సీ తన కెరీర్ లో 1000 మ్యాచ్ ల మైలురాయిని దాటాడు. ప్రస్తుత తరంలో మరో మేటి ఆటగాడిగా ఉన్న  క్రిస్టియానో రొనాల్డో తన 1000వ అంతర్జాతీయ మ్యాచ్  2020లోనే పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతడు 725 గోల్స్ చేయగా మరో 216 గోల్స్ చేసేందుకు సహకరించాడు. మెస్సీ మొత్తం 789 గోల్స్ చేసి, మరో  348 గోల్స్ కు సహకారం అందించి రొనాల్డో కంటే ముందున్నాడు.


More Telugu News