పవన్ కల్యాణ్ చెప్పింది వాస్తవమే: అంబటి రాంబాబు

  • నిన్న శిల్పకళావేదికలో సీఏ విద్యార్థుల కార్యక్రమం
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
  • ఇప్పటివరకు తాను విఫల రాజకీయ నాయకుడ్నని వెల్లడి
  • స్పందించిన అంబటి రాంబాబు
జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న హైదరాబాదు శిల్పకళావేదికలో జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇప్పటివరకూ తాను ఒక ఫెయిల్యూర్ రాజకీయనాయకుడ్ని అని పేర్కొన్నారు. పరాజితుడ్ని అని చెప్పేందుకు తనకెలాంటి మొహమాటం లేదన్నారు. 

పవన్ వ్యాఖ్యలపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫెయిల్ అనేది వాస్తవం అని తెలిపారు. పవన్ కేవలం నటుడిగానే విజయవంతం అయ్యారని వెల్లడించారు. 

ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఒక్కసారి కూడా గెలిచింది లేదు అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇక ముందు కూడా పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. 

సైద్ధాంతిక విధానం అంటూ ఏమీలేని పవన్... రాజకీయల్లో తన పాత్రను సరిగా పోషించలేకపోతున్నారని విమర్శించారు. విప్లవనేతగా పార్టీని ఏర్పాటు చేసిన పవన్ తనను తాను చేగువేరా అని చెప్పుకుంటాడని... కానీ, సిద్ధాంతాలను పక్కనబెట్టి కమ్యూనిస్టులతోనూ, బీజేపీతోనూ కలిశారని తెలిపారు. పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని స్పష్టం చేశారు.


More Telugu News