ఒకే ఓవర్లో రోహిత్​, కోహ్లీని ఔట్​ చేసి భారత్​ ను దెబ్బకొట్టిన షకీబ్​

  • నిరాశ పరిచిన శిఖర్ ధవన్
  • క్రీజులో కుదరుకున్నాక వెనుదిరిగిన రోహిత్
  • ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్న శ్రేయస్, కేఎల్ రాహుల్
బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో భారత టాపార్డర్ నిరాశ పరిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధవన్ 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్పిన్నర్ మెహ్దీ హసన్ మిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ మంచి షాట్లతో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ, 11వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ భారత్ ను దెబ్బకొట్టాడు. మూడు బంతుల తేడాతో రోహిత్, కోహ్లీని ఔట్ చేశాడు. 

31 బంతుల్లో 27 రన్స్ చేసిన రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో 9 పరుగులు చేసిన కోహ్లీ.. షకీబ్ బాల్ డ్రైవ్ చేయగా.. ఎక్స్ ట్రా కవర్ లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ క్యాచ్ చూసి విరాట్ సైతం ఆశ్చర్యపోయారు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్ తీసుకున్నారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడటంతో డ్రింక్స్ బ్రేక్ సమయానికి 17 ఓవర్లలో భారత్ 80/3 స్కోరుతో నిలిచింది. శ్రేయస్ 17, కేఎల్ రాహుల్ 11 పరుగులు చేశారు.


More Telugu News