బీసీల పేరెత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు: యనమల

  • 56 కార్పొరేషన్లు పెట్టినా పైసా ఖర్చు చేయలేదని మండిపడ్డ టీడీపీ నేత
  • బీసీలను మోసగించిన దుర్మార్గ చరిత్ర జగన్ రెడ్డిదేనని విమర్శ
  • మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు చేసిందేముందని నిలదీసిన యనమల
జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలంతా మాకు ‘ఇదేం ఖర్మ’ అని బోరుమంటుంటే.. బీసీలను ఉద్దరించినట్లు సభ పెట్టి, మరోమారు మోసం చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ రెడ్డి దిగజారుడుతనానికి ఇప్పుడు ఏర్పాటు చేసిన బీసీ సభే అందుకు నిదర్శనమని విమర్శించారు. బీసీల గొంతుకై నిలుస్తూ తెలుగుదేశం పార్టీ నినదించిన ‘జయహో బీసీ’, ‘బీసీ గర్జన’ వంటి నినాదాలను కూడా కాపీ కొట్టారు కానీ టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను మాత్రం ఆపేశారని యనమల ఆరోపించారు. బీసీలను జగన్ రెడ్డి నిట్టనిలువునా ముంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీసీలకు అన్నిరకాలుగా అండగా నిలిచింది, ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడేనని యనమల వెల్లడించారు. మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జగన్ రెడ్డి చేసిందేమీలేదని విమర్శించారు. అంకెల గారడీతో ఏదేదో చేశామని బీసీలను మభ్యపెడుతున్నారని యనమల చెప్పారు. అధికారాలు ఉన్న పదవులేమో సొంత వారికి కట్టబెడుతూ పవర్ లేని పదవుల్లో బీసీలను నియమిస్తున్నారని, సబ్ ప్లాన్ నిధులను కూడా మళ్లించి బీసీలను జగన్ రెడ్డి వంచించారని ఆరోపించారు.

జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు..
1. రూ.34 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీల ద్రోహం కాదా?
2. టీడీపీ హయాంలో కీలక పదవులు బీసీలకు అప్పగిస్తే.. నేడు ‘నై నై బీసీ’ అనేలా పదవులన్నీ సొంత సామాజికవర్గానికి కట్టబెట్టడం నిజం కాదా?
3. అమరావతి నిర్మాణం నుండి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వరకు అన్నింటా నాడు చంద్రబాబు పక్కన బీసీలుంటే.. నేడు తాడేపల్లి ప్యాలెస్ గేటు బయట బీసీలను నిలబెట్టి అవమానించడం నిజం కాదా?
4. వైసీపీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేల్లో 90 శాతం మందికి అసలు తాడేపల్లి ప్యాలస్ లోకి అనుమతి లేదన్నది నిజం కాదా?
5. సెంటు స్థలాల పేరుతో 8 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడం బీసీ ఉద్దరణా?
6. చేతి వృత్తులు చేసుకునే బీసీల ఆదరణ పరికరాలు తుప్పు పట్టించడం బీసీల సంక్షేమమా?
7. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి 16,800 మందికి పదవులు దూరం చేయడం బీసీలను దగా చేయడం కాదా?
8. బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు రూ.2300 కోట్ల బకాయిలు పెట్టడం బీసీ పారిశ్రామిక వేత్తలను దగా చేయడం కాదా?
9. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి భూ దందాకు, రాయలసీమలో పెద్దిరెడ్డి ఆగడాలకు, సజ్జల రామకృష్ణారెడ్డి దాష్టీకాలకు బలవుతున్నది బలహీన వర్గాలు కాదా?
10. స్వయం ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకు నెలవుగా ఉండే కార్పొరేషన్లను రాజకీయ నిరుద్యోగ కేంద్రంగా మార్చడం బీసీలకు చేసిన మేలా?
11. నామినేటెడ్ పదవుల్లో 5శాతం కూడా బీసీలు లేకుండా మొత్తం సొంత వారితో నింపుకోవడం బీసీలను అణచివేయడం కాదా?
12. సలహాదారులుగా ఉండేవారంతా మేధావులే, అందుకే సలహాదారులుగా బీసీలు ఎవరూ లేరు అంటూ అసెంబ్లీ సాక్షిగా మీరు బీసీలను అవమానించడం వాస్తవం కాదా?
13. టీడీపీ హయాంలో 9 మంది బీసీలను యూనివర్శిటీ వీసీలుగా నియమిస్తే.. వారితో బలవంతంగా రాజీనామాలు చేయించి సొంత వారిని నియమించుకోవడం బీసీలకు చేసిన ద్రోహం కాదా?
14. తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో బీసీలే ఉంటే.. వైసీపీలో అధ్యక్షుడి నుంచి జిల్లా ఇంఛార్జిల వరకు మొత్తం మీ సామాజిక వర్గంతో నింపేసుకోవడం బీసీలకు చేసిన మేలా?
15. ఇసుక పాలసీ రద్దుతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని, జీవో నెం.217తో మత్స్యకారులను రోడ్డున పడేస్తున్నారు. నూతన మద్యం పాలసీలతో తాడేపల్లి నింపుకుని బలహీన వర్గాల ప్రజల ప్రాణాలు తీస్తుండడం దగా కాదా?

జయహో బీసీ అంటూ పెడుతున్న సభలో మూడున్నరేళ్ల పాలనలో బీసీల కోసం ఏంచేశావని చెబుతావని జగన్ రెడ్డిని యనమల నిలదీశారు. చేనేత వర్గానికి చెందిన జింకా వెంకటనరసయ్యను చంపి నీ తాత రాజా రెడ్డి ఎలా ఎదిగారో చెబుతావా? గత మూడున్నరేళ్ల నీ పాలనలో 26 మంది బీసీ నేతల హత్యల గురించి చెబుతావా? అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, కాలవ శ్రీనివాసులు వంటి బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించావో చెబుతావా? అధికారంలోకి వచ్చాక బీసీలను ఎంతగా దగా చేశావో, ఎంతటి అరాచకాలకు పాల్పడ్డావో చెబుతావా? అసలు ఏం చెప్పడానికి ‘‘జయహో బీసీ’’ సభ పెడుతున్నావో సమాధానం చెప్పాలని జగన్ రెడ్డిని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.


More Telugu News