జోడో యాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెన్షన్ వేటు

  • మధ్యప్రదేశ్ లో విద్యాశాఖ అధికారుల నిర్ణయం
  • కండక్ట్ రూల్స్ అతిక్రమించాడని వివరణ ఇచ్చిన అధికారులు
  • తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. సర్వీసు కండక్ట్ రూల్స్ ను అతిక్రమించాడనే ఆరోపణలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లోని కనస్య జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, రాజకీయాలకు అతీతంగా సాగుతున్న యాత్రలో పాల్గొన్నందుకు ఇలా సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

మధ్యప్రదేశ్ లోని ఆదివాసీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రైమరీ స్కూల్ లో రాజేశ్ కన్నోజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండడంతో రాజేశ్ సెలవు పెట్టి ఈ యాత్రలో పాల్గొన్నాడు. నవంబర్ 24న రాహుల్ గాంధీని కలిసి తను వేసిన పెయింటింగ్స్ ను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి కాస్తా వైరల్ గా మారడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ప్రొఫెషనల్ కండక్ట్ రూల్స్ అతిక్రమించారంటూ రాజేశ్ కు నోటీసులు పంపించారు. ఆపై విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సస్పెన్షన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్ జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొన్నందుకు రాజేశ్ ను సస్పెండ్ చేయడంపై మండిపడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జోడో యాత్రలో పాల్గొన్నాడని రాజేశ్ ను సస్పెండ్ చేయడం అన్యాయమని ఆరోపించింది.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు వివరణ ఇస్తూ.. అత్యవసర పని ఉందంటూ రాజేశ్ సెలవు పెట్టి జోడో యాత్రలో పాల్గొన్నాడని చెప్పారు. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం సరికాదని చెప్పారు. అది కాండాక్ట్ రూల్స్ ను ఉల్లంఘించడమేనని, అందుకే రాజేశ్ పై చర్యలు తీసుకున్నామని తెలిపారు.


More Telugu News