ఎయిమ్స్ కంప్యూటర్ల హ్యాకింగ్ వెనుక చైనా గ్రూపుల హస్తం!

  • ఇటీవల ఎయిమ్స్ సర్వర్లపై హ్యాకర్ల పంజా
  • రూ.200 కోట్లు డిమాండ్ చేసిన హ్యాకర్లు
  • గతం వారం రోజులుగా స్తంభించిన ఎయిమ్స్ సర్వర్లు
  • సెర్ట్, కేంద్ర హోంశాఖ దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కంప్యూటర్ సర్వర్లపై హ్యాకర్ల దాడి జరగడం తెలిసిందే. రూ.200 కోట్లను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలంటూ హ్యాకర్లు డిమాండ్ చేశారు. ఈ రాన్సమ్ వేర్ దాడి కారణంగా గతం వారం రోజులుగా ఎయిమ్స్ లో కంప్యూటర్ వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. ఇప్పటికీ అక్కడ మామూలు పద్ధతిలో రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 

ఈ హ్యాకింగ్ పై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్), కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేపట్టాయి. ఎయిమ్స్ కంప్యూటర్లపై దాడి వెనుక చైనా హ్యాకింగ్ గ్రూపులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. 'ఎంపరర్ డ్రాగన్ ఫ్లై', 'బ్రాంజ్ స్ట్రెయిట్' (డీఈవీ-0401) అనే రెండు గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా సంస్థలపై హ్యాకింగ్ కు పాల్పడుతుంటాయి. ఇప్పుడీ చైనా గ్రూపులకు అనుబంధంగా ఉన్న వాళ్లే ఎయిమ్స్ సర్వర్లను స్తంభింపజేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇది నిర్ధారణ కావాల్సి ఉంది. 

'లైఫ్' అనే మరో గ్రూప్ పైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ గ్రూప్ 'వన్నారెన్' పేరిట కొత్త తరహా ర్యాన్సమ్ వేర్ దాడులు చేస్తుంటుంది. కాగా, ఎయిమ్స్ నుంచి తస్కరించిన డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టి ఉంటారని భావిస్తున్నారు. హ్యాకర్ల డిమాండ్ ను అంగీకరించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. లక్షల మంది రోగుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News