నా లగేజ్ రాలేదు.. రేపు మ్యాచ్ ఎలా ఆడాలంటున్న భారత క్రికెటర్

  • మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో ఢాకా చేరుకున్న దీపక్ చహర్
  • విమానం దిగిన తర్వాత లగేజీ రాకపోవడంతో అసహనం
  • ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంపై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వైనం
భారత క్రికెటర్ దీపక్ చహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ కోసం దీపక్ చహర్.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నాడు. కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అతనికి సంబంధించిన లగేజ్ ఇంకా రాలేదు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగే తొలి వన్డేలో భారత్.. ఆతిథ్య బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇంకా తనకు సంబంధించిన వస్తువులు రాకపోవడంతో ఈ మ్యాచ్ లో ఎలా ఆడాలని దీపక్ చహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌ను నిలదీశాడు. విమానం దిగి ఒక రోజు దాటిపోతున్నా ఇంతవరకు లగేజీ రాలేదని మండిపడ్డాడు. అత్యంత చెత్త సర్వీస్ అంటూ మలేషియా ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 

 తన లగేజ్ విషయంలోనే కాకుండా ప్రయాణ సమంయలోనూ ఇబ్బంది ఎదురైందని చెప్పాడు. సమాచారం ఇవ్వకుండానే విమానం మార్చారన్నాడు. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినా తినడానికి ఆహారం ఇవ్వలేదని చెప్పాడు. ప్రయాణం ముగిసినా 24 గంటలుగా తన లగేజీ కోసం ఎదురు చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 

‘రేపు జరిగే తొలి వన్డే మ్యాచ్‌ను ఎలా ఆడాలి. అత్యంత చెత్త సర్వీస్' అంటూ ట్వీట్ చేసిన చహర్ దాన్ని మలేషియా ఎయిర్‌లైన్స్‌కు ట్యాగ్ చేశాడు. ఇక దీపక్ చహర్ ట్వీట్‌‌పై మలేషియా ఎయిర్‌లైన్స్ భారత పేసర్‌కు క్షమాపణలు చెప్పింది. తమ కస్టమర్ సర్వీస్‌కు కాల్ చేసి లగేజ్ గురించి సమాచారం తెలుసుకోవాలని సూచించింది. అయితే అది పని చేయడం లేదని దీపక్ ప్రశ్నించగా.. తమ ప్రతినిధే స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారని చెబుతూ మరోసారి క్షమాపణలు కోరింది.


More Telugu News