తన ప్రేయసిని పరిచయం చేసిన భారత తొలి ‘గే’ క్రీడాకారిణి ద్యుతీచంద్

  • ఒడిశాలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మేటి అథ్లెట్ గా
     ఎదిగిన ద్యుతి 
  • తాను స్వలింగ సంపర్కురాలినని 2019లో ప్రకటించిన వైనం
  • ప్రేయసిని ప్రకటించడంతో ఆమె పెళ్లిపై మొదలైన పుకార్లు
భారత అథ్లెటిక్స్ లో ఒడిశాకు చెందిన ద్యుతీచంద్ ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్ర్పింటర్ గా కొనసాగుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లను దాటుకొని వచ్చి  స్టార్ అథ్లెట్ గా ఎదిగింది. కొన్నేళ్ల కిందట తాను గే అని ప్రకటించి, భారత క్రీడారంగాన్ని ఆశ్చర్యపరిచింది. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా చెప్పిన భారత తొలి అథ్లెట్ ఆమెనే. తాజాగా తన ప్రేయసి మోనాలిసాని పరిచయం చేసింది. ఆమెతో దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. 

దానికి ‘నిన్న నిన్ను ప్రేమించా.  ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా, ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. దాంతో, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి. తన సోదరి పెళ్లి వేడుకలో మోనాలిసాతో ద్యుతి ఈ ఫొటో దిగినట్టు తెలుస్తోంది. దాంతో, సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు వస్తున్నాయి. 

తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీ చంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది.


More Telugu News