బంగ్లాతో వన్డే సిరీస్ ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ

  • గాయంతో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ షమీ
  • ట్రెయినింగ్ సమయంలో భుజానికి గాయం
  • అతని స్థానంతో జట్టులోకి ఉమ్రాన్ మాలిక్
బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మూడు వన్డేల సిరీస్ కు దూరమయ్యాడు. అతని భుజానికి గాయం అయిందని బీసీసీఐ శనివారం వెల్లడించింది. షమీ స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను జట్టులో చేర్చినట్టు ప్రకటించింది. 

‘బంగ్లాదేశ్ తో వన్డేలకు ముందు ట్రెయినింగ్ సెషన్ లో ఫాస్ట్ బౌలర్ షమీ భుజానికి గాయమైంది. అతను ప్రస్తుతం బెంగళూరు ఎన్సీఏలో బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలనలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదు. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసింది’ అని ప్రకటించింది. 

33 ఏళ్ల షమీ చాన్నాళ్ల నుంచి భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ లో అతను కీలకంగా మారనున్నాడు. కాగా, గాయం తగ్గకపోతే అతను బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు కూడా దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే జూన్ లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ కు ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ఆదివారం ఢాకాలో జరగనుంది.


More Telugu News