ఏపీకి ఈ ఖర్మను ప్రజలే తీసుకొచ్చారు: అశోక్ గజపతిరాజు
- దోచుకుని జైలుకు వెళ్లొచ్చిన వారిని అందలం ఎక్కించారన్న అశోక్
- రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శ
- జీతాలు కూడా పొందలేకపోవడం ఉద్యోగుల ఖర్మ అని వ్యాఖ్య
జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, వారు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయానని అన్నారు. ఏపీకి ఇలాంటి ఖర్మను ప్రజలే తీసుకురావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకుని జైలుకు వెళ్లొచ్చిన వారిని అందలం ఎక్కించడం ఖర్మ కాక మరేమిటని ప్రశ్నించారు. జైలుకు వెళ్లొచ్చిన ప్రతి వ్యక్తి మహాత్మాగాంధీ కాదని అన్నారు. జీతాలను కూడా సకాలంలో పొందలేకపోవడం ఉద్యోగుల ఖర్మ అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని అన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఈరోజు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.