ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో.. సీఎస్కేకు సేవలు

  • ఐపీఎల్ తోనే కొనసాగనున్న బ్రావో
  • చెన్నై జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ గా నియామకం
  • కొత్త పాత్ర పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానన్న వెస్టిండీస్ ఆల్ రౌండర్
టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు నమోదు చేసిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. ఊహించని షాక్ ఇచ్చాడు. వచ్చే సీజన్ కు బ్రావోను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అట్టిపెట్టుకోకుండా అతడ్ని విడుదల చేసింది. అంతేకాదు. అతడ్ని కొత్త బౌలింగ్ కోచ్ గా సీఎస్కే నియమించింది. ఏక కాలంలో ఈ రెండు పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దీంతో ఐపీఎల్ కు బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు.

కొత్త పాత్ర పట్ల బ్రావో ఎంతో సంతోషాన్ని ప్రకటించాడు. ‘‘నేను ఈ కొత్త ప్రయాణం కోసం వేచిచూస్తున్నాను. ఎందుకంటే నా ఆట (కెరీర్) దాదాపుగా ముగిసిన తర్వాత నేను చేస్తున్న పని ఇది. బౌలర్లతో కలసి పనిచేయడాన్ని నేను ఆస్వాదిస్తాను. ఈ రోల్ పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆటగాడి నుంచి కోచ్ పాత్రకు మారడం అంటే సర్దుకుపోవాలనేమీ అనుకోవడం లేదు. ఎందుకంటే ఆటగాడిగానూ తోటి బౌలర్లతో కలిసే పనిచేశాను. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వాడిగా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐపీఎల్ చరిత్రలో భాగంగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను’’ అని బ్రావో పేర్కొన్నాడు. టీ20ల్లో 600కు పైగా వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా బ్రావో రికార్డు నమోదు చేయడం తెలిసిందే.


More Telugu News