అత్యాధునిక పరికరాలతో సరిహద్దులను కట్టుదిట్టం చేస్తున్న బీఎస్ఎఫ్

  • సరిహద్దుల భద్రతకు టెక్నాలజీ తోడు
  • డ్రోన్లు, జామర్లు, థర్మల్ ఇమేజర్లు కొనుగోలు చేస్తున్న బీఎస్ఎఫ్
  • ఉగ్రవాదుల కదలికలను పసిగట్టే పరికరాలు
  • పాక్, బంగ్లాదేశ్ సరిహద్దులపై దృష్టిపెట్టిన భద్రతాదళం
దేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలను అడ్డుకునేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధునాతన టెక్నాలజీతో కూడిన పరికరాలను సమకూర్చుకుంటోంది. తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లను బీఎస్ఎఫ్ కొనుగోలు చేసింది. 

కాగా, ఎలక్ట్రానిక్ జామర్లను అమర్చేందుకు మహీంద్రా స్కార్పియో వాహనాలను వినియోగించాలని బీఎస్ఎఫ్ వర్గాలు భావిస్తున్నాయి. థర్మల్ ఇమేజర్ల సాయంతో మంచు వాతావరణంలోనూ ఉగ్రవాదుల కదలికలను పసిగట్టవచ్చు. డ్రోన్లతో పక్కాగా నిఘా వేసే వీలుంటుంది. 

పాకిస్థాన్ తో 2,289 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా వీటిని మోహరించనున్నారు. అటు, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని 635 సున్నిత ప్రాంతాల్లోనూ ఈ అత్యాధునిక పరికరాల సాయంతో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. 

బీఎస్ఎఫ్ ఇప్పటికే పంజాబ్ వద్ద పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థలను మోహరించింది. భారత గగనతలంలోకి ప్రవేశించే డ్రోన్లను ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థలు జామ్ చేయడమే కాకుండా, వాటిని కూల్చివేయగలవు. ఇవి లేజర్ ఆధారిత వ్యవస్థలు.


More Telugu News