శాంసన్ వేచి చూడాల్సిందే అంటూ.. ఫామ్ లో లేని పంత్ నే వెనకేసుకొచ్చిన ధావన్

  • న్యూజిలాండ్ పర్యటనలో శాంసన్ కు సరైన అవకాశాలు ఇవ్వకపోవడంపై విమర్శలు
  • ఫామ్ లో లేకపోయినప్పటికీ అన్ని మ్యాచ్ ల్లో బరిలోకి దిగిన పంత్
  • పంత్ టాలెంటెడ్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చిన ధావన్
భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన పూర్తయింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన భారత్ టీ20 సిరీస్ గెలిచి, వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తానికి ఆరు మ్యాచ్ ల్లో వర్షం వల్ల మూడు మ్యాచ్ లే జరిగాయి. వీటిలో సంజు శాంసన్ కు కేవలం రెండో వన్డేలో మాత్రమే అవకాశం లభించింది. అదే సమయంలో పేలవ ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కు మాత్రం అటు టీ20ల్లో, వన్డేల్లో అవకాశం లభించింది. దీనిపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన శాంసన్ కు సరైన అవకాశాలు ఇవ్వకుండా.. ఫామ్ కోల్పోయిన పంత్ ను ఎందుకు పట్టుకొని వేళ్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. 

దీనిపై వన్డే టీమ్ స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ, రిషబ్ పంత్ కే మద్దతు ఇచ్చాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తుది జట్టుపై నిర్ణయాలు ఉంటాయన్నాడు. పంత్ ఇంగ్లండ్ లో సెంచరీ చేశాడని, ఫామ్ లో లేనప్పుడు అతనికి అండగా నిలవాల్సి ఉంటుందని చెప్పాడు. శాంసన్ వేచి ఉండక తప్పదన్నాడు. ఒంటి చేత్తో గెలిపించే సత్తా పంత్ కు ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా తాను కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడంటూనే అతను కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ధావన్ స్పష్టం చేశాడు. పంత్ టాలెంటెడ్ ప్లేయర్, మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిచ్చాడు.


More Telugu News