నేను ఎక్కడికీ పోలేదు.. విచారణకు పిలిస్తే వెళ్తా: బొంతు రామ్మోహన్

  • రామ్మోహన్ అజ్ఞాతంలోకి పోయారని పెద్ద ఎత్తున ప్రచారం
  • తాను హైదరాబాద్ లోనే ఉన్నానన్న బొంతు
  • సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాస్ తో తనకు పరిచయం లేదని వ్యాఖ్య
హైదరాబాద్ నగర మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని... మూడు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన చెప్పారు. 

తాను కనిపించకపోయేసరికి కొందరు మీడియా మిత్రులు ఊహించుకుని వార్తలు రాసినట్టుందని అన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ విచారిస్తున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. కమ్యూనిటీకి సంబంధించిన ఫంక్షన్ లో కొందరు నాయకులను శ్రీనివాస్ కలిశారని... ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పారని, ఆయనతో అంతకు మించి పరిచయం లేదని చెప్పారు.

శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పు చేస్తే తమకు ఏం సంబంధమని అన్నారు. ఆయన తప్పు చేస్తే, ఆయనను విచారిస్తే, ఆయనకు సంబంధించిన విషయాలు తెలుస్తాయని చెప్పారు. వీటన్నింటి వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. మీ దగ్గర నుంచి రూ. 20 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు బదులుగా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పారు. తనకు ఇంత వరకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. ఒకవేళ నోటీసులు వస్తే తనను తాను నిరూపించుకుంటానని చెప్పారు.


More Telugu News