గుజరాత్‌లో మరికాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్.. రూ. 478.65 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

  • వడోదర శివారులోని ఓ ఫ్యాక్టరీలో నిషేధిత మెఫిడ్రన్ డ్రగ్స్ తయారీ
  • డార్క్‌వెబ్ ద్వారా డ్రగ్స్ తయారీ నేర్చుకుని మెఫిడ్రన్ తయారీ
  • 63.7 కిలోల మెఫిడ్రన్, 80.26 కిలోల ముడిపదార్థాల స్వాధీనం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మరికాసేపట్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. అంతలోనే నిన్న రూ. 478.65 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. వడోదర శివారులోని ఓ తయారీ యూనిట్‌లో ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అధికారులు వీటిని పట్టుకున్నారు. వీటిలో నిషేధిత మెఫిడ్రన్ డ్రగ్స్, దాని ముడిపదార్థాలు ఉన్నాయి. జిల్లాలోని సింధ్రోత్ జిల్లా సమీపంలోని ఓ చిన్న ఫ్యాక్టరీ గోదాములో డ్రగ్స్ తయారుచేస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్ అధికారులు దాడిచేసి పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎండీ డ్రగ్ పేరుతో మెఫిడ్రన్‌ను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

దాడుల సందర్భంగా 63.7 కిలోల మెఫిడ్రన్, 80.26 కిలోల ముడి పదార్థాలు, తయారీ మిషన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వడోదరకు చెందిన సౌమిల్ పాఠక్ తన స్నేహితులతో కలిసి ఈ యూనిట్‌ను నిర్వహిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. డార్క్ వెబ్ ద్వారా అతడు నార్కోటిక్స్ డ్రగ్స్ తయారీ నేర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అని పేర్కొన్నారు.

మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం
గుజరాత్‌లో మరికాసేపట్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. ఇక్కడ 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ దానిని నిలబెట్టుకోవాలని చూస్తుండగా ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని ప్రచారాస్త్రంగా మార్చుకున్న ఆమ్ ఆద్మీ.. పంజాబ్‌లో మాదిరిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని యోచిస్తోంది. కాగా, ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.


More Telugu News