ఊబర్ రైడర్లకు కొత్త ఫీచర్లు
- భద్రత కోసం ఎస్ వో ఎస్ ఫీచర్
- అత్యవసర పరిస్థితుల్లో దీని సాయంతో స్థానిక పోలీసులకు సమాచారం
- సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ ఆడియో రిమైండర్
ఊబర్ ట్యాక్సీల్లో ప్రయాణించే వారి కోసం కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అప్ డేటెడ్ రైడ్ చెక్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎస్ వో ఎస్ ఇంటెగ్రేషన్, అప్ గ్రేడెడ్ సేఫ్టీ టూల్ కిట్ వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కంటే తమకు మరొకటి ముఖ్యం కాదని ఊబర్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సూరజ్ నాయర్ తెలిపారు. డ్రైవర్లు, రైడర్లకు మెరుగైన అనుభవం కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, మానవ ప్రమేయంపై పనిచేస్తూ ఉంటామని ప్రకటించారు.
- ఊబర్ కారులో వెనుక కూర్చున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. ప్రయాణికులు డోర్ తీసి సీటులో కూర్చున్నప్పుడు ఆడియో రూపంలో రిమైండర్ వినిపిస్తుంది.
- రైడ్ చెక్ ఫీచర్ ను ఊబర్ 2019లోనే తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని మరింత నవీకరించింది. దీని ద్వారా క్యాబ్ అనుకున్న మార్గంలోనే వెళుతుందా? డ్రైవర్ గమ్యస్థానం రాకుండానే ట్రిప్ ను ముగించాడా? అన్నది తెలుసుకోవచ్చు.
- ఎస్ వో ఎస్ ఇంటెగ్రేషన్ ఫీచర్ తో అత్యవసర సాయం అవసరమైతే దాన్ని సెలక్ట్ చేసుకుంటే, లైవ్ లొకేషన్ సమాచారం స్థానిక పోలీసులకు చేరుతుంది. దీంతో వారు వెంటనే చర్యలు తీసుకుంటారు.
- భద్రతకు సంబంధించి సమస్యలు ఉంటే రైడర్లు ప్రత్యేక నంబర్ 88006 88666 కు కాల్ చేసి చెప్పొచ్చు. రోజులో 24 గంటల పాటు ఇది పనిచేస్తుంది.